ముస్లిం సోదరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సామరస్యాలు, కారుణ్యం మన సమాజంలో మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, సుఖ, సంతోషాలతో, సౌభాగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రేమ, కారుణ్యాలకు సంబంధించిన పండుగ అని తెలిపారు. ఇతరులకు సహాయపడాలనే సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. మనమంతా కలిసికట్టుగా సమాజంలో సోదరభావాన్ని వృద్ధి చేద్దామని శపథం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్." అంటూ ట్వీట్ చేశారు.