ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధానపార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలని భారీగా ఆశలు పెట్టుకుని ఉంది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎన్నికల ప్రచారానికి పూనుకుంది. ఇక తమ ప్రచారంలో భాగంగా చాలా చోట్ల ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అలా ఓ చోట ప్రధాని మోదీ కటౌట్ ని చూసిన వ్యక్తి.. ఆ తర్వాత చేసిన పనికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఫిదా అవుతున్నారు.
దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌పై ఓ వ్యక్తి వర్షం నీటిని తుడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. శుక్రవారం సాయంత్రం వర్షంలో తడిసిన ప్రధాని కటౌట్‌ను తెల్లటి చొక్కా, ధోతీ ధరించిన వృద్ధుడు తుడవడం వీడియోలో ఉంది. వీడియో చిత్రీకరించిన వ్యక్తి డబ్బు కోసం చేస్తున్నావా అని ప్రశ్నించగా.. ‘నాకు డబ్బు అవసరం లేదు.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోను.. ఆయనపై నాకున్న ప్రేమ, నమ్మకం వల్లే చేస్తున్నాను. " అని అన్నారు. బీజేపీ నేతలు ఈ వీడియోను షేర్ చేస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.