టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు ఆదివారం సంతాపం తెలిపారు. సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డీజీపీతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చామని ఫడ్నవీస్ తెలిపారు.
టాటా గ్రూప్ మాజీ చీఫ్ మరణవార్త విని షాక్‌కు గురయ్యానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. "టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ మరణం గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యారు. అతను విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. ప్రకాశవంతమైన, దూరదృష్టి గల వ్యక్తిగా కూడా కనిపించాడు. ఇది తీరని నష్టం. నా హృదయపూర్వక నివాళి" అని సీఎం షిండే అన్నారు.
విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. "సైరస్ మిస్త్రీ మరణించారనే వార్త చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.