బంగ్లా పర్యటనకు మోదీ
PM Modi begins 2-day visit to Bangladesh from today. కరోనా మహమ్మారి ప్రభంజనం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని విదేశీ పర్యటనలోబంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ ప్రయాణమయ్యారు.
By Medi Samrat Published on 26 March 2021 10:13 AM ISTకరోనా మహమ్మారి ప్రభంజనం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని విదేశీ పర్యటనలో పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మోడీ ప్రయాణమయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో భారత ప్రధాని మోదీ ఢాకాలో బంగ్లా స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. దాంతోపాటు బంగ్లాదేశ్ జాతిపిత, బంగ బంధు షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంత్యుత్సవంలోనూ పాల్గొంటారు. తాజాగా ముజిబుర్ రహమాన్‌కు భారత్- గాంధీ శాంతి పురస్కారం (2020) ప్రకటించడం, దీనికి బంగ్లాదేశ్ కృతజ్ఞతలు తెలపడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మోదీ పర్యటనలో రెండు దేశాలు బంగబంధు-బాపూ ప్రదర్శనలు నిర్వహిస్తాయి.
కొవిడ్ కాలంలో జాగ్రత్తలను పాటిస్తూనే మోదీతోపాటు పలువురు ప్రపంచ నాయకులు బంగ్లా జాతీయ ఉత్సవాల్లో పాల్గొంటారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి ఘనంగా నివాళులు సమర్పిస్తారు. బంగ బంధు మ్యూజియంను సందర్శిస్తారు. ప్రత్యేక సైనిక కవాతులను వీక్షిస్తారు. భారత ప్రధాని మోదీ టుంగిపారాలో బంగబంధు ముజిబ్ స్వగృహాన్ని సందర్శించి అంజలి ఘటిస్తారు. తరవాత రెండు హిందూ ఆలయాలను దర్శించనున్నారు.
ఈ కరోనా పాండమిక్ తరుణంలో ఇదే తన మొదటి విదేశీ పర్యటన అని మోదీ చెప్పారు. ఆ దేశంలో ప్రధాని షేక్ హసీనాను కలుస్తానని, భారత, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక అంశాలపైనా, సంబంధాల మెరుగుదలపైనా తాము చర్చిస్తామని ఆయన ప్రకటించారు. ఇంతకాలం తరువాత తాను మరో దేశానికి వెళ్లడం ఓ విశేషమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంతో మన దేశానికి సాంస్కృతిక, భాషా పరమైన సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని అయన ట్వీట్ చేశారు.
యాభై ఏళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారత్ సర్వవిధాలా సాయపడింది. బంగ్లా స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిధిగా పాల్గొనవలసిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశం ఆహ్వానించడం, అందుకు ఆయన సమ్మతించడం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక బంధానికి ప్రతీక.