పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారతదేశం తీసుకునే సైనిక చర్యను సమీక్షించడానికి ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవుతున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగానే భారత్ చర్యలపై ప్రధాని మోడీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్‌తో భేటీ అయ్యారు. శనివారం నాడు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మోదీ సమావేశమైన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 26న, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, ఇతర సాయుధ దళాల అధిపతులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో, పాకిస్తాన్‌పై చర్య తీసుకోవడానికి సాయుధ దళాలకు ప్రధాని మోదీ "స్వేచ్ఛా హస్తం" ఇచ్చారు .
పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ఏప్రిల్ 30న లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీని కలిశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మే 3న సాయంత్రం 6 గంటలకు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశం గంటసేపు కొనసాగింది.
అలాగే ఉగ్రదాడి నేపథ్యంలోనే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ భేటీలో కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇక శుక్రవారం నాడు యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించింది. ఇక, ఉగ్రదాడి అనంతరం దాయాది దేశాన్ని భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తున్న విషయం తెలిసిందే. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ వణికిపోతోంది.