సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం..!
Pakistani drone spotted again on Punjab border. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో పాక్ డ్రోన్‌లు మరోసారి
By Medi Samrat Published on 17 Nov 2021 8:02 PM ISTఅమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో పాక్ డ్రోన్‌లు మరోసారి కనిపించాయి. అయితే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పులు జరపడంతో డ్రోన్ పాకిస్థాన్ వైపునకు తిరిగి వెళ్లింది. ఈ సంఘటన ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అమృత్‌సర్ తహసీల్ అజ్నాలాలోని సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ సైనికులు గుర్తించారు. ఆ తర్వాత బీఎస్‌ఎఫ్ సైనికులు డ్రోన్‌పై 20 రౌండ్లు కాల్పులు జరిపారు. బీఎస్‌ఎఫ్ కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ తిరిగి వెళ్ళిపోయింది. ఘటన తర్వాత పోలీసులు, బీఎస్‌ఎఫ్ సిబ్బంది డ్రోన్ తిరుగాడిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
పంజాబ్‌లో చాలా కాలంగా సరిహద్దుల నుంచి డ్రోన్‌లు వస్తున్నాయి. అక్టోబరు నెలలో పాకిస్థాన్ డ్రోన్లు రెండుసార్లు భారత సరిహద్దులోకి ప్రవేశించాయి. అక్టోబర్ నెలాఖరున అమృత్‌సర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌లు కనిపించాయి. అజ్నాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండో-పాక్ సరిహద్దులోని షాపూర్ సరిహద్దు పోస్ట్ సమీపంలో డ్రోన్ కనిపించగా.. బీఎస్ఎఫ్ 73వ బెటాలియన్ కాల్పులు జరిపింది. కాల్పుల అనంతరం అవి పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లిపోయాయి. అక్టోబరు 19 మరియు 20 రాత్రి అమృత్‌సర్ సెక్టార్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో అలాంటి డ్రోన్ ఒకటి కనిపించింది.. ఆ తర్వాత బీఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో వెతకగా కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల ద్వారా పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్ లోకి వస్తూ ఉన్నాయి.