మధ్యప్రదేశ్‌లోని కట్ని గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఓవైపు ఉండగా.. ఇప్పుడు ఎన్నికల్లో ఒక గుంపు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేయడం కట్ని జిల్లాలో సంచలనంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాయాది దేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని మాకు ఫిర్యాదు అందిందని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని, విచారణ చేపట్టామని విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కట్ని కి చెందిన కొంత మంది వ్యక్తులు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారని CSP విజయ్ సింగ్ గుర్తించారు. అప్పటి నుండి ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 'జీత్ గయా భాయ్ జీత్ గయా పాకిస్తాన్ జీత్ గయా (పాకిస్తాన్ గెలిచింది!)' అని నినాదాలు చేయడం చూడవచ్చు. పంచాయితీ ఎన్నికల రెండో విడత ఓట్ల లెక్కింపు శుక్రవారం రాత్రి ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.