పాకిస్థాన్ కు చెందిన మహిళ ఏకంగా భారత్ లో సర్పంచ్ అయిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చాలా రోజులుగా వీసాను పొడిగించుకుంటూ వెళుతున్న మహిళ ఏకంగా సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలుపొందింది. ఈ విషయం పోలీసులకు స్థానికులు చెప్పగా.. ఎట్టకేలకు ఆమెను కొద్దిరోజుల పాటూ వెతికి మరీ పట్టుకున్నారు. జలేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాక్ కు చెందిన మహిళ బానో బేగమ్, గడావు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయమై ఫిర్యాదులు రాగా, జలేసర్ పోలీసులు జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు బానో బేగం పారిపోయింది. దాదాపు నెలన్నర రోజుల పాటు ఆమెకోసం వెతికిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. ఈతాహ్ జిల్లా ఎస్ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. గ్రామస్థులే ఆమె పాక్ జాతీయురాలని ఫిర్యాదు చేశారు. గ్రామంలో పంచాయత్ ప్రధాన్ గా ఉన్న వ్యక్తి చనిపోవడంతో, మధ్యంతర ఎన్నికలు జరగడంతో వాటిల్లో బానో విజయం సాధించింది. స్థానికుల ఫిర్యాదు తరువాత, ఆమె పాక్ కు చెందిన మహిళని, 1980, జూన్ 8న జిల్లాకు చెందిన అఖ్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని భారత్ కు వచ్చింది. ఆపై తన వీసాను పొడిగించుకుంటూ భారత్ లోనే ఉండిపోయింది.