జై భీమ్ తరహా ఘటన.. నలుగురు పోలీసు అధికారులపై..
Odisha Crime Branch registers murder case against 4 police personnel. 2017లో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో మరణించడానికి సంబంధించి
By Medi Samrat
2017లో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో మరణించడానికి సంబంధించి ఒడిశా క్రైమ్ బ్రాంచ్ నలుగురు పోలీసు సిబ్బందిపై హత్య కేసు నమోదు చేసింది. క్రైమ్ బ్రాంచ్ అదనపు ఎస్పీ రామచంద్ర తాంబ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. క్రైమ్ బ్రాంచ్ ఏడీజీ సంజీబ్ పాండా కూడా ఈ దర్యాప్తు బృందంలో ఉన్నారు. నలుగురు పోలీసు సిబ్బందిలో జైపూర్ పోలీస్ స్టేషన్ మాజీ IIC తపన్ నారాయణ్ రాత్, ఎస్.ఐ. లు సిబా ప్రసాద్ సాహు మరియు రాజేష్ బలియార్‌సింగ్, మాజీ SDPO రాజేంద్ర ప్రసాద్ సేనాపతి ఉన్నారు.
కొన్ని నేరాలలో వాంటెడ్ అయిన ఆకాష్ మహూరియం అనే వ్యక్తి జనవరి 30, 2017న కోరాపుట్ జిల్లాలోని జైపూర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేయడంతో మరణించాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మాత్రం మహూరియాను అరెస్టు చేయడానికి వెంబడిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కిందపడటం వల్ల చనిపోయాడని తెలిపారు. అయితే ఆకాష్ మహూరియాను పోలీసులే లాకప్ లో చంపేశారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవల మరణించిన ఆకాష్ మహూరియా తల్లి ప్రబీనా మహూరియా నలుగురు పోలీసు అధికారులపై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు.
జనవరి 30, 2017 మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య, ఐఐసి తపన్ నయన్ రాత్‌తో పాటు ఎస్‌ఐ సిబా ప్రసాద్ సాహు మరికొంత మంది పోలీసు సిబ్బంది ఆకాష్‌ను పట్టుకుని చెంపదెబ్బలు కొట్టడం, మరియు కాళ్లతో తొక్కడం వంటివి చేశారని.. పోలీసులు అతన్ని బలవంతంగా జీప్‌లో జైపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కస్టడీలో ఉన్నప్పుడు తీవ్రంగా కొట్టి చంపేశారని బాధితుడి తల్లి తెలిపింది. నలుగురు పోలీసు అధికారులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 302, 323, 342, 325, 505, 34 కింద కేసు నమోదు చేశారు.