ఆమెకు అధికారం తలకెక్కింది.. నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Nupur Sharma's statement responsible for unfortunate killing in Udaipur. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందించింది.
By Medi Samrat Published on 1 July 2022 4:29 PM IST
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని... అందువల్ల అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమెకు ముప్పు ఉందా? లేక ఆమే దేశ భద్రతకు ముప్పుగా మారారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తన వ్యాఖ్యల ద్వారా దేశంలోని ఎంతో మంది ప్రజల భావోద్వేగాలను ఆమె రెచ్చగొట్టారని.. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. హింసాత్మక ఘటనలన్నింటికీ ఆమే కారణమని.. ఒక పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడతారా? అని ప్రశ్నించింది. ఆమెకు అధికారం తలకెక్కిందని.. అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అలజడిని రేపినందుకుగాను దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించింది. దేశ వ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి బదిలే చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
నుపుర్ శర్మ తరపు లాయర్ తన వాదనలను వినిపిస్తూ.. టీవీ డిబేట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నుపుర్ శర్మ సమాధానం ఇచ్చారని అన్నారు. సదరు టీవీ ఛానల్ యాంకర్ పై కూడా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసం చట్టవిరుద్ధమైన అంశంపై చర్చించాల్సిన అవసరం నుపుర్ శర్మకు గానీ, ఆ టీవీ ఛానల్ కు కానీ ఏముందని ప్రశ్నించింది.
మే నెలాఖరులో.. అప్పటి అధికార బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక టీవీ చర్చలో ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా వివాదానికి కారణమైంది. డిబేట్ కు సంబంధించిన క్లిప్ వైరల్ కావడంతో, ఖతార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా.. 14 దేశాలు ఈ వ్యాఖ్యలపై భారతదేశాన్ని నిందించాయి. ఆ తర్వాత బీజేపీ నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.