అసదుద్దీన్ కు షాక్ ఇచ్చిన మాయావతి
No tie-up with AIMIM in Uttar Pradesh, says BSP chief Mayawati. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులను ఇతర
By Medi Samrat Published on 27 Jun 2021 6:27 PM ISTఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులను ఇతర రాష్ట్రాలలో నిలుపుతూ ఉన్నారు. అలా కొన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం విజయం కూడా అందుకుంది. ముఖ్యంగా ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలుపుతూ ఉంది. అలాగే పలు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అసదుద్దీన్ ఒవైసి. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ఎలెక్షన్స్ లో మమతా బెనర్జీతో చేయి కలపాలని అనుకున్న అసదుద్దీన్ ఒవైసికి మమతా బెనర్జీ షాక్ ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో ఎంఐఎం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో చేతులు కలపాలని అనుకున్న అసదుద్దీన్ కు మరోసారి భంగపాటు ఎదురైంది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మాయావతి స్పష్టం చేశారు. మజ్లిస్ (ఏఐఎంఐఎం)తో పొత్తు పెట్టుకుంటున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. మజ్లిస్ తో పొత్తు ప్రసక్తే లేదని ఆమె ట్వీట్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని ఓ చానెల్ వార్తను ప్రసారం చేస్తోంది. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ నిరాధారమైన బూటకపు వార్తలు. పంజాబ్ లో లాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం అని తెలిపారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నిజాలను నిర్ధారించుకున్నాకే ఇలాంటి వార్తలను ప్రసారం చేయాలని ఆమె మీడియాను కోరారు.