ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం 11 గంటలకు డెహ్రాడూన్‌లోని విధానసభలో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ బన్సీధర్ భగత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సాయంత్రం జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని బీజేపీ ఉత్తరాఖండ్ చీఫ్ మదన్ కౌశిక్ తెలిపారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్ మాజీ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్ధి ఎంపికకు మాకు చాలా ఆప్షన్‌లు ఉన్నాయని అన్నారు.
ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మార్చి 11న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆయనే ఆపద్ధర్మ సీఎంగా వ్యవహరిస్తారు.