కొత్త‌ పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

New Parliament building. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం భూమిపూజ నిర్వ‌హించారు.

By Medi Samrat  Published on  10 Dec 2020 9:43 AM GMT
కొత్త‌ పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం భూమిపూజ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 130 కోట్ల మంది భార‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన సంద‌ర్భం అని, కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం.. పాత‌, కొత్త స‌హ‌జీవ‌నానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లంతా క‌లిసి ఈ కొత్త బిల్డింగ్‌ను నిర్మిస్తార‌న్నారు. స‌మ‌యం, అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తొలిసారి ఓ ఎంపీగా 2014లో పార్ల‌మెంట్ లోకి అడుగుపెట్టిన రోజును త‌న జీవితంలో ఎన్న‌డూ మ‌రిచిపోలేన‌ని మోదీ అన్నారు. తాను ప్ర‌జాస్వామ్య ఆల‌యంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌.. శిర‌స్సు వంచి ప్ర‌జాస్వామ్య ఆల‌యానికి సెల్యూట్ చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఇక‌, పాత పార్ల‌మెంట్ భ‌వ‌నం స్వాతంత్య్ర ఉద్య‌మానికి పూర్వం మార్గ‌ద‌ర్శ‌కం చేసింద‌ని.. అయితే కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్‌కు సాక్షిగా నిలుస్తుంద‌ని మోదీ అన్నారు.

పాత పార్ల‌మ‌మెంట్ భ‌వ‌నం దేశ అవ‌స‌రాల‌ను తీర్చింద‌ని.. అలాగే, కొత్త బిల్డింగ్ 21వ శ‌తాబ్ధ‌పు ఆశ‌ల‌ను నిజం చేస్తుంద‌ని మోదీ అన్నారు. పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలో గ‌త వందేళ్ల‌లో ఎన్నో పున‌ర్ నిర్మాణాలు జ‌రిగాయ‌ని, ఇప్పుడు ఆ భ‌వ‌నం విశ్రాంతి కోరుకుంటోంద‌ని.. 21వ శ‌తాబ్ధానికి కొత్త బిల్డింగ్‌ను ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అని ఆయ‌న అన్నారు. ఆ కార్య‌క్ర‌మానికి కేంద్ర ‌మంత్రులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, వివిధ దేశాల రాయ‌బారులు పాల్గొన్నారు.


Next Story