ట్రైనీ డాక్టర్ హత్య కేసు.. మమత ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు, ఆసుపత్రి యంత్రాంగంపై సుప్రీం ప్రశ్నల వర్షం
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది
By Medi Samrat Published on 20 Aug 2024 1:57 PM ISTకోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం.. మమత ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు, ఆసుపత్రి అధికార యంత్రాంగంపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ విషయమై ఎనిమిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులు ఎందుకు రక్షణ కల్పించడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం ఎందుకు జరిగింది? అని పోలీసులను ప్రశ్నించింది. ఆర్‌జికె ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్న నిరసనను ప్రభుత్వ బలగాలను ఉపయోగించి బలవంతంగా ఆపవద్దని కోర్టు పేర్కొంది. సీబీఐ స్టేటస్ రిపోర్టును ఆగస్టు 22న సమన్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22న జరగనుంది.
ఇది కేవలం హత్యకేసు కాదని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. వైద్యుల భద్రతపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో బాధితురాలి గురించిన వివరాలను వెల్లడించడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
మృతదేహాన్ని చూసేందుకు బాధిత కుటుంబాన్ని అనుమతించకపోవడం నిజం కాదా అని సీజేఐ ప్రశ్నించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. ఆ ఆరోపణలు నిజమేనన్నారు. మృతదేహాన్ని గార్డియన్‌కు అప్పగించిన మూడున్నర గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ ఎందుకు దాఖలు చేశారని కోర్టు ప్రశ్నించింది.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. బాధితురాలి వివరాలు ఎలా బయటకు వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. 7 వేల మంది ఆసుపత్రిలోకి ప్రవేశిస్తే.. అక్కడ పోలీసులు ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. శ్రామికశక్తిలో మహిళల సంఖ్య పెరిగే కొద్దీ మహిళల భద్రతపై ఆందోళన పెరుగుతుందని.. ఇలాంటి మరో దుర్ఘటన వరకూ మేము వేచి ఉండలేమని సీజేఐ అన్నారు.