తమిళనాడులోని మీనాక్షిపురం ముత్తుమారి అమ్మన్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న హిందూ భక్తులకు ఒక ముస్లిం పెద్దాయన చేసిన సహాయం ఇప్పుడు ప్రజల హృదయాలను దోచుకుంటోంది. భక్తులు 'మాసి పంగుని' పండుగను చేసుకుంటూ తలపై పాలకుండలు (పాల్ కుడం) ఉంచి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగకు భక్తులు తమిళనాడు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారు. ఆ సమయంలో భక్తులు వేడికి తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వేడిని దృష్టిలో ఉంచుకుని, బజార్ మసీదు నుండి వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి వేడి నుండి కాస్త ఉపశమనాన్ని ఇవ్వడానికి వారి నడక మార్గంలోనూ, వారి పాదాలకు కూడా నీరు పోశారు. వాటర్ పైప్ సహాయంతో అలా చేశాడు.
తిరుచ్చి జిల్లాలోని వరసితి గణేశ ఆలయం నుండి రాజ రాజేశ్వరి అమ్మన్ ఆలయానికి వెళ్తున్న భక్తులకు ముస్లింలు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ 24వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా దాదాపు 250 మంది భక్తులు 'పాల్ కుడం'ను మోసుకెళ్లారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి చల్లటి మజ్జిగ దాహాన్ని తీర్చడానికి సహాయపడింది. ఈ ఘటనలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.