అంబానీ కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Mukesh Ambani, Family's Security Can Stay With Centre, Says Supreme Court. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అత‌ని కుటుంబ సభ్యుల భద్రతపై

By Medi Samrat  Published on  22 July 2022 3:15 PM GMT
అంబానీ కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అత‌ని కుటుంబ సభ్యుల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముంబైలో ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రతను కేంద్రం అలాగే కొనసాగించాల‌ని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంబానీ కుటుంబ భ‌ద్ర‌త విష‌యంలో త్రిపుర హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. కేంద్రం చేసిన అప్పీల్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం స్వీక‌రించింది. ఈ మేర‌కు భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది. అంబానీ కుటుంబ ​భద్రత కల్పించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిల్‌పై త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్​ 29న సుప్రీం కోర్టు స్టే విధించింది.

అంబానీ, ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్ల‌కు కొన‌సాగుతున్న భ‌ద్ర‌త‌పై త్రిపుర హైకోర్టు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై ఇప్ప‌టికే స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా శుక్ర‌వారం అంబానీ ఫ్యామిలీకి కొన‌సాగుతున్న భ‌ద్ర‌త‌పై స్ప‌ష్ట‌త నిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ కృష్ణ‌మాచారి, జ‌స్టిస్ హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖేశ్‌తో పాటు ఆయ‌న భార్య‌, ఆయ‌న పిల్ల‌ల‌కు పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా భ‌ద్ర‌త‌ను కొన‌సాగించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

అంబానీ, ఆయన ఫ్యామిలీకి కొన‌సాగుతున్న భ‌ద్ర‌త‌ను స‌వాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్య‌క్తి త్రిపుర హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. అంబానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు పొంచి ఉన్న ముప్పున‌కు సంబంధించిన నివేదిక‌ను అంద‌జేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌కు ఆదేశాలు జారీ చేసింది. ఏ కుటుంబానికైనా భద్రత కల్పించడం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదని, అంబానీ భద్రతకు త్రిపురకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో అప్పీల్‌లో పేర్కొంది. అంబానీకి Z+ భద్రత ఉంది. అతని భార్య నీతా అంబానీకి పెయిడ్ Y+ సెక్యూరిటీ ఉంది.


Next Story