కేంద్ర బడ్జెట్ పై రాహుల్, మోదీ స్పందన ఇదే..!
Modi Rahul About Budget 2021. ఈ బడ్జెట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు
By Medi Samrat Published on 1 Feb 2021 11:52 AM GMTఎంతగానో ఆసక్తి రేపిన కేంద్ర బడ్జెట్ అందరి ముందుకు వచ్చింది. ఈ బడ్జెట్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ ఉందని నరేంద్ర మోదీ కితాబివ్వగా.. ప్రజలకిచ్చిన హామీ విస్మరించారని రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్-2021పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉందని.. సంక్షేమానికి పట్టం కట్టిన బడ్జెట్ ఇదని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులకు ఇందులో పెద్దపీట వేశామని.. పారదర్శకతతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి బాటలో నడిపిస్తుందని.. ఈ బడ్జెట్ తో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి తీరప్రాంత రాష్ట్రాలు శక్తి కేంద్రాలుగా మారతాయని అన్నారు. ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని.. అభివృద్ధితో పాటే ఉద్యోగ కల్పనకు చేయూతనిస్తుందని అన్నారు. ఈ బడ్జెట్ ను ప్రధానంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు మోదీ తెలిపారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామన్న హామీని మర్చిపోయారని విమర్శలు చేశారు. ప్రజలను విస్మరించిన మోదీ సర్కారు దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఎంతో విసుగుచెందినట్టుగా కనిపించారు. ఏ బడ్జెట్ వలన ఎవరికీ ఎటువంటి మేలు జరగదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.