రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పోలీసులు మొబైల్ ఫోన్స్ దొంగలను పట్టుకున్నారు. సంజయ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారులు మొబైల్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠాలోని ఇద్దరు సభ్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి అనేక కీప్యాడ్, స్మార్ట్ మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్స్ సంఖ్య 121 అని అధికారులు లెక్క తేల్చారు. డీసీపీ నార్త్ పరిష్ దేశ్‌ముఖ్, అదనపు డీసీపీ ధర్మేంద్ర సాగర్ నేతృత్వంలో పోలీసులు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. నిందితులు మొబైల్ దొంగతనం సమయంలో దుర్మార్గంగా వ్యవహరించేవారని, ఆపై వాటిని షాపుల్లో విక్రయించేవారని దేశ్‌ముఖ్ చెప్పారు. విచారణలో నిందితులు 300కు పైగా దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులంతా డ్రగ్స్‌కు బానిసలని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం, జనవరి 5, 2022 న మొబైల్ చోరీ కేసు గురించి సమాచారం అందుకున్న తరువాత, ACP కొత్వాలి సురేష్ సంఖ్లా, సంజయ్ సర్కిల్ స్టేషన్ ఆఫీసర్ మహ్మద్ షఫీక్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడింది . సంఘటనా స్థలంలోని అనేక సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఈ బ్యాచ్ నగరంలో చాలా కాలంగా దొంగలు మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్యాంగ్ ప్రతిరోజూ 5 నుంచి 7 మొబైల్ చోరీలకు పాల్పడ్డారు. నిందితులు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ దొంగిలించిన మొబైల్‌లోని లాక్ లను అన్‌లాక్ చేశారు.