ఆన్‌లైన్‌లో క్లాసులు వినేందుకు ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్‌లు వాడుతున్నారు. అయితే ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా ఎక్కువసేపు దానిని ఉపయోగించడం ప్రాణాంతకమే అవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మొబైల్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరయ్యాడు. ఇంతలో మొబైల్ పేలింది. దీంతో విద్యార్థి ముఖం కాలిపోయింది. తీవ్రమైన స్థితిలో.. అతన్ని సత్నాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతన్ని జబల్‌పూర్‌కు రిఫర్ చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటన సత్నా జిల్లా నాగౌర్ తహసీల్‌లోని చడ్కుయా గ్రామంలో చోటుచేసుకుంది.
రాంప్రకాష్(15) ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆన్‌లైన్ తరగతులకు సిద్ధమయ్యాడు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి క్లాసులు వింటున్నాడు. ఈ సమయంలోనే మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో రాంప్రకాష్ నోరు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు అతన్ని నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని సత్నా జిల్లా ఆసుపత్రికి పంపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్‌పూర్‌కు తరలించారు. విద్యార్థి నోరు, ముక్కు పూర్తిగా ఛిద్రమైందని వైద్యులు చెబుతున్నారు.
తండ్రి భాను ప్రసాద్ మాట్లాడుతూ.. తన కొడుకు రోజూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతూ ఉన్నాడని.. గురువారం మధ్యాహ్నం కూడా ఇంట్లోనే చదువుకుంటున్నాడు. అప్పుడే పెద్ద చప్పుడు వినిపించింది. కుటుంబ సభ్యులంతా అతని గదికి చేరుకుని చూస్తే రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని తెలిపాడు.