రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై శరద్ పవార్ స్పందించారు. ఎన్నికల యంత్రాంగాన్ని నియంత్రించడానికి రాష్ట్రంలో అధికారం, డబ్బు దుర్వినియోగం జరిగిందని.. ఇది ఏ రాష్ట్ర అసెంబ్లీ, జాతీయ ఎన్నికలలో ఎన్నడూ చూడలేదని NCP చీఫ్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై పవార్ మహాయుతిని టార్గెట్ చేశారు. ఇంత భారీ మెజారిటీ వచ్చినా ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఇది స్పష్టంగా ప్రజల ఆదేశాన్ని అవమానించడమే.. మహాయుతికి ప్రజల ఆదేశంపై పట్టింపు లేదని అన్నారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్న సీనియర్ కార్యకర్త డాక్టర్ బాబా అధవ్‌ను కలిసిన సందర్భంగా శరద్ పవార్ ఈ ప్రకటన చేశారు. 90 ఏళ్ల అధవ్ తన మూడు రోజుల నిరసనను గురువారం నగరంలోని సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే నివాసమైన ఫూలే వాడలో ప్రారంభించారు.
విలేకరులతో మాట్లాడిన పవార్.. ఈవీఎంలలో దొంగ ఓట్లు పడ్డాయన్న కొందరు నేతల వాదనల్లో కొంత నిజం ఉందని, అయితే దానిని ధృవీకరించే ఆధారాలు తమ వద్ద లేవని అన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికార దుర్వినియోగం, ధన ప్రవాహాం చోటు చేసుకున్నాయని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. స్థానిక స్ధాయి ఎన్నికల్లో ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కానీ ధనబలం, అధికార దుర్వినియోగంతో మొత్తం ఎన్నికల వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకోవడం గతంలో ఎన్నడూ చూడలేదు. దీంతో ప్రస్తుతం ప్రజలు అశాంతికి గురవుతున్నారని అన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రమాదం పొంచి ఉందని.. అందుకే పెద్ద ఎత్తున తిరుగుబాటు అవసరమని శరద్ పవార్ అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రతిపక్షాలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా తమను మాట్లాడనివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేయాలనుకుంటున్నారని దీన్నిబట్టి తెలుస్తోందన్నారు