మూఢనమ్మకాలు మనుషుల్లో ఎంతగా పేరుకుపోయాయో చెప్పే ఘటన ఇది..! వర్షాలు పడడం కోసం ఎన్నో ప్రాంతాల్లో.. ఎన్నో రకాల ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మాత్రం అత్యంత దారుణ ఘటనకు పాల్పడ్డారు గ్రామస్తులు. వరుణ దేవుడిని మెప్పించబోతున్నామంటూ మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కొందరు బాలికలను నగ్నంగా నడిపించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగించారు. వారి వెనుక గ్రామానికి చెందిన మహిళలు నడుస్తూ వరుణ దేవుడి పాటలు పాడుతూ నడిచారు.
దమోహ్ జిల్లాలోని బనియా అనే గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలికల తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తూ ఉన్నారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో వర్షాలు లేక కరువు ముసురుకుంటున్న వేళ గ్రామస్తులు మూఢనమ్మకాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. ఐదేండ్లలోపు బాలికలు ఆరుగురు ఒకరి పక్కన ఒకరు దుస్తులు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి బయటకు రాగా.. ఇది ఆ ఊరిలో జరిగిన దారుణ ఘటనే అని ఆ తర్వాత తెలిసింది. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయ్యింది. అధికారులు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలంటూ ఆర్డర్స్ జారీ చేసింది.