ఉత్తరప్రదేశ్‌లోని దౌరాలాలో నిర్మాణంలో ఉన్న కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కోల్డ్ స్టోరేజీ భవనంలో పేలుడు సంభవించడంతో భవనం కూలిపోయిందని చెబుతున్నారు. పేలుడు కుదుపు, పేలుడు ఒత్తిడి కారణంగా భవనం కూలిపోయిందని ఇండియా టుడే నివేదించింది. రెస్క్యూ ప్రక్రియ జరుగుతోంది. పోలీసులు, స్థానికుల సహకారంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన మీరట్‌లోని దౌరాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ 27 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 మందిని సురక్షితంగా తరలించారు. కోల్డ్ స్టోరేజీ కంప్రెసర్ పేలిపోయిందని చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి భవనం కూలిపోయింది. ఘటన దౌరాలా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.