గ్రేటర్ నోయిడాలోని బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హాస్టల్ లోపల చిక్కుకున్న ఇద్దరు బాలికలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రెండవ అంతస్తు నుండి దూకేశారు. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్-3 ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ బాలికల హాస్టల్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో ఏర్పాటు చేసిన ఏసీలో పేలుడు కారణంగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సంఘటన జరిగిన సమయంలో హాస్టల్‌లో ఉన్న కొంతమంది బాలికలు తప్పించుకోగలిగారు.
హాస్టల్‌లోని రెండవ అంతస్తులో చిక్కుకున్న ఇద్దరు బాలికలను స్థానికులు నిచ్చెన సహాయంతో రక్షించారు. ఒక బాలిక నిచ్చెన ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదని, పూర్తిగా సురక్షితంగా ఉందని తెలిపారు.