త్రిపురలో బీజేపీకి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల నాయకుడు(శాసనసభా పక్ష నేత)గా మాణిక్ సాహా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తన మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ఎన్నికలలో 60 స్థానాలకు గానూ బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్చి 8న జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
మాణిక్ సాహా 2016లో బీజేపీలో చేరారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. త్రిపుర ఎన్నికలకు 10 నెలల ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బిప్లబ్ కుమార్ దేబ్ ను సీఎం పదవి నుంచి తప్పించిన బీజేపీ.. మాణిక్ సాహాకు బాధ్యతలు అప్పగించింది. రాజకీయాల్లోకి రాకముందు.. ఓరల్, మాక్సిల్లోఫేషియల్ సర్జరీ స్పెషలిస్ట్ అయిన మానిక్ సాహా.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించేవారు.