త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
Manik Saha sworn-in as new Tripura CM.
By Medi Samrat Published on 15 May 2022 9:18 AM GMTబిప్లబ్ కుమార్ దేబ్ త్రిపుర సీఎం పదవికి రాజీనామా చేసిన నేఫథ్యంలో ఆయన స్థానంలో ఆ రాష్ట్ర ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు మాణిక్ సాహా ఆ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య.. మాణిక్ సాహా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా బిజెపి, దాని మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) నుండి ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రులుగా ప్రమాణం చేయలేదు. ఈ విషయమై కొత్త ముఖ్యమంత్రిని అడగగా.. ఏమీ వెల్లడించలేదు.
పెద్ద ఎత్తున రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన సీపీఐ-ఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాయి. మార్చి 31న త్రిపురలోని ఏకైక స్థానం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సాహా వచ్చే ఆరు నెలల్లోగా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన సాహా త్రిపుర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సాహా.. 2015లో బీజేపీలో చేరి 2021లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి 2023 జనవరి-ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.