ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో సహోద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల భార్యను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీ ఆవరణలో గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్యభర్తలు ఇద్దరూ ఓ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోనే నివసిస్తున్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
అయితే.. భార్య ఫ్యాక్టరీలో పనిచేసే మరో కార్మికుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం ఉందని.. ఈ క్రమంలోనే గురువారం తన భార్యతో గొడవపడి, ఆమెపై దాడి చేసి, ఆమె గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.