ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జంజ్‌గిర్-చంపా ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమంలో వరుడిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనతో పెళ్లి కార్యక్రమంలో కాస్తా కలకలం మొదలైంది. వరుడు ఆలయంలో రెండవ వివాహం చేసుకునే సమయానికి అతని మొదటి భార్య అక్కడికి వచ్చింది. భర్త రెండో పెళ్లి గురించి మొదటి భార్యకు తెలియడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంది. మొదటి భార్య బంధువులు పెళ్లి కొడుకును తన్నడం, పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. బలోదాబజార్ నివాసి సోమ్ ప్రకాష్ నారాయణ్ జైస్వాల్ వివాహం జరుగుతుండగా.. ఓ మహిళ కొంతమందితో కలిసి వచ్చి వీరంగం సృష్టించింది. పెళ్లికొడుకైన సోమ్ ప్రకాష్ కాలర్ పట్టుకుంది మహిళ. ఆ తర్వాత గొడవ చాలా పెద్దదయింది. ఈ దాడి ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వరుడిపై దాడి చేసిన మహిళ బిర్రా ప్రాంతానికి చెందిన దామిని జైస్వాల్. ఆమె 2017 మే 7వ తేదీన సోమ్ ప్రకాష్‌ని వివాహం చేసుకుంది. వారం రోజుల తర్వాత దామినిపై అత్తమామలు రూ.2లక్షలు, బైక్ కట్నం కింద తీసుకుని రావాలని వేధింపులకు పాల్పడ్డారు. ఒక నెల తరువాత, భర్త భార్యను కొట్టడం ప్రారంభించాడు. జూలై 15, 2017న దామినిని పుట్టినింటికి పంపించారు. ఆమె తన అత్తమామల ఇంటికి వెళ్లడానికి పిలుపు కోసం వేచి ఉంది, కానీ ఆమెను తీసుకెళ్లడానికి అక్కడ నుండి ఎవరూ రాలేదు. సంసారం చేయాలంటే డబ్బులు, బైక్ లు తీసుకురావాలని మెసేజ్ వస్తూనే ఉంది. అయితే దామిని కట్నం మాత్రం ఇవ్వలేదు. తాజాగా దామిని తన భర్త రెండో పెళ్లి చేసుకుంటూ ఉన్నాడని సమాచారం అందుకుంది. ఆ తర్వాత జరిగిన విషయం మీకు తెలిసిందే..! ఇప్పుడు దామిని కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేశారు.