బట్టలు విప్పించిన దొంగలు..!
Man Forced To Take Off Clothes During Robbery In Delhi. ఢిల్లీ లోని రఘుబీర్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని
By Medi Samrat Published on 11 July 2021 4:46 PM IST
ఢిల్లీ లోని రఘుబీర్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని దోచుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. దొంగలు మొదట ఆ వ్యక్తిని బెల్టుతో కొట్టారు, తరువాత అతని వస్తువులను లాక్కున్నారు అక్కడితో ఆగని ఆ దొంగలు బట్టలు కూడా విప్పించిన ఘటన సిసిటివి కెమెరాలో రికార్డు అయింది. నిర్మానుషంగా ఉన్న వీధి మధ్యలో బట్టలు తీయమని బలవంతం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
వీడియోలో ఇద్దరు దొంగలు వీధిలో ఓ వ్యక్తిని దోచుకుంటూ ఉండగా.. మూడవ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వారి కోసం వేచి ఉన్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు దొంగలు మరియు బాధితుడు తప్ప మరెవరూ వీధిలో లేరు. వీడియోలో వాహనాలు వారి నుండి కొన్ని మీటర్ల దూరంలో అధిక వేగంతో వెళుతుండడం గమనించవచ్చు. దోపిడీ జరుగుతున్న సమయంలో ఒక మోటారు సైక్లిస్ట్ కూడా వీధిలోకి ప్రవేశించాడు, కాని అతడు వారిని చూడగానే యు-టర్న్ చేసి వెళ్ళిపోయాడు. బాధిత వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్ అని, రఘుబీర్ నగర్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు తరువాత లక్విందర్, దీపక్, ఆకాష్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల నుంచి బాధితుడి నుంచి దోచుకున్న వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.