'ఆమెకు కుక్కలంటే ఇష్టం.. అందుకే నాకు లైంగిక సమస్యలు..'
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు.
By - Medi Samrat |
కుక్కలను ప్రేమించేవారికి కొదవలేదు. కుక్కలను పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక మహిళ కుక్కను పెంచుకుంది. ఆమె కుక్కలను ఎంతగానో ప్రేమిస్తుంది. అవి తనకు ఒత్తిడిని కలిగించాయని.. తన లైంగిక సమస్యలను మరింత తీవ్రతరం చేశాయని ఆమె భర్త పేర్కొన్నాడు. గుజరాత్‌లో ఈ వింత ఉదంతం చర్చనీయాంశమైంది.
తన భార్యకు కుక్కల పట్ల ప్రేమతో తనకు లైంగిక సమస్యలు వచ్చాయని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించి విడాకులు కోరాడు ఓ 41 ఏళ్ల వ్యక్తి. తన భార్య ఇంట్లోకి వీధికుక్కలను తీసుకొచ్చి, తన ఊహాత్మక వివాహేతర సంబంధాల గురించి చిలిపి కాల్స్ చేసి తనను అవమానపరిచిందని ఆరోపించాడు.
ఈ జంట 2006లో వివాహం చేసుకున్నారు. వారు ఉన్న ప్రాంతంలో కుక్కలను పెంచుకోవడం నిషేధించారు. అయినా ఆ వ్యక్తి భార్య ఓ కుక్కను ఇంటికి తీసుకొచ్చింది. అది కూడా వీధికుక్క. ఆమె ఒక వీధి కుక్కను ఇంటికి తీసుకువచ్చి దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఆ ఒక్క కుక్కతో ఆగకుండా మరికొన్ని వీధికుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చింది.
ఆ తరువాత భర్తతో వంట పని చేయించడం, ఇల్లు శుభ్రం చేయించడం, కుక్కలను చూసుకోమని చెప్పేది. ఒకసారి కుక్క నిద్రించడానికి తమ బెడ్‌పైకి వచ్చిందని, అది తనను కరిచిందని ఆ వ్యక్తి చెప్పాడు. ఇరుగుపొరుగు వారు కూడా కుక్కలను పెంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తన భార్య జంతు హక్కుల సంఘంలో చేరింది. ఇతరులపై పదేపదే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మద్దతు ఇవ్వమని నన్ను కూడా పిలిచింది. నేను నిరాకరించడంతో ఆమె నన్ను దుర్భాషలాడింది, అవమానించింది. అదికాకుండా ఏప్రిల్ 1, 2007న, తన భార్య తమ అనుబంధం గురించి రేడియో జాకీకి ప్రాంక్ కాల్ చేసిందని, ఇది పని వద్ద, సమాజంలో తనను బాగా ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నాడు. బెంగుళూరుకు పారిపోయినా భార్య వేధిస్తూనే ఉందని వెల్లడించాడు. దీంతో చివరకు కోర్టును ఆశ్రయించానని.. ఈ విషయాలన్నీ తనకు ఒత్తిడిని కలిగించాయని, ఒత్తిడి వలన నా ఆరోగ్యం మరింత దిగజారిందని.. అంగస్తంభన లోపానికి కారణమైందని అతను పేర్కొన్నాడు.
ఆ వ్యక్తి 2007లో అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతడు తనను విడిచిపెట్టాడని.. కేవలం కుక్కలను బూచిగా చూపుతున్నాడని.. భర్త కుక్కలను కౌగిలించుకున్న, ముద్దు పెట్టుకున్న ఫోటోలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది.
మీడియా నివేదికల ప్రకారం.. ఈ కేసు ఫిబ్రవరి 2024లో విచారణకు వచ్చింది. కుటుంబ న్యాయస్థానం భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. "సాక్ష్యాధారాల దృష్ట్యా.. పిటిషనర్ ప్రతివాది తన పట్ల క్రూరంగా ప్రవర్తించిందని లేదా విస్మరించిందని నిరూపించడంలో విఫలమయ్యాడు. ఇది విడాకులు కోరడానికి కారణం కాదు" అని కోర్టు పేర్కొంది.
అయితే భర్త విడాకులు కావాలని డిమాండ్ చేస్తూ రూ.15 లక్షల భరణం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు. దీంతో భార్య రూ.2 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 1న జరగనుంది.