యాస్ తుపాను సమీక్ష సమావేశం సందర్భంగా అగ్గిబరాటా మమతా బెనర్జీ ప్రధాని మోదీని 30 నిమిషాల పాటు ఎదురు చూసేలా చేశారంటూ వచ్చిన కథనాలపై ఆమె ఫైర్ అయ్యారు. కేంద్రం తనపై కావాలనే నిందలు మోపుతోందంటూ మండిపడ్డారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేంద్రం ఈ విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాళ్లు పట్టుకోవడానికికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

తమ గెలుపుతో భంగపడ్డ కేంద్రం అప్పట్నించి ఏదో ఓ వివాదం రేకెత్తిస్తున్నారని, తనను అవమానిస్తున్నారని మమత మండిపడ్డారు. ప్రధాని-ముఖ్యమంత్రి సమావేశం మాత్రమే జరగాల్సి ఉండగా కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రధాని ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసి, గవర్నర్ జగదీప్ ధన్ఖర్‌ సహా ప్రతిపక్షాలను ఆహ్వానించారని మమత ఆరోపించారు. ఒక్క తన రాష్ట్రం లోనే సమావేశాల్లో ప్రతిపక్ష నేతలను సమావేశానికి ఆహ్వానించారని, ఇతర రాష్ట్రాల విషయంలో ఇలా ఎప్పుడూ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించారు.

ప్రధాని, గవర్నర్‌లు మమతా బెనర్జీ కోసం 30 నిమిషాలు నిరీక్షించారన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను తోసిపుచ్చిన దీదీ.. టార్మాక్ వద్ద మోదీ కోసం 20 నిమిషాలు తానే నిరీక్షించానని తెలిపారు. నిజానికి ప్రధాని మోదీ ఏరియల్ సర్వేకు వచ్చిన రోజున తనకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని, అవన్నీ ఒకరోజు ముందే షెడ్యూల్ అయ్యాయన్నారు.

తాను పర్యటన మధ్యలో ఉండగా, ప్రధాని మోదీ ఏరియల్ సర్వేపై సమాచారం అందిందని, అయినప్పటికీ తాను ఈ సమావేశానికి హాజరు కావటానికి వచ్చానన్నారు. అయితే ప్రధాని సమావేశం మాత్రం రాజకీయ సమీకరణాలు సరిచేసేందుకే అన్నట్టుగా సాగిందని విమర్శించారు. తన తరువాత పర్యటన కోసం ప్రధాని అనుమతిని ఒకసారి కాదు మూడు సార్లు కోరానన్నారు. బెంగాల్ కన్నా ఇంకేదీ తనకు ముఖ్యం కాదన్న దీది అనవసర రాజకీయాలు చేయద్దంటూ హితవు పలికారు.జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story