పశ్చిమ బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, యూనిఫాం సివిల్ కోడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశం కోసం రక్తం చిందించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే దేశం కోసం హింసకు పాల్పడితే మాత్రం సహించబోమన్నారు దీదీ. యూనిఫాం సివిల్ కోడ్ ఆమోదయోగ్యం కాదని అన్నారు. అన్ని మతాల మధ్య సామరస్యం ఉండాలని, అదే తాను కోరుకుంటూ ఉన్నానని మమతా బెనర్జీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన సభలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడైనా పేలుడు జరిగితే చాలు.. ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయడానికి ఎన్‌ఐఏను పంపుతున్నారని మమత అన్నారు. అందరినీ అరెస్టు చేసుకుంటూ పోతే దేశంలో ప్రజలే ఉండరని అన్నారు. అందమైన ఆకాశం కావాలంటే.. అందరూ కలిసి ఉండాలన్నారు.. ఎవరైనా అల్లర్లు చేయడానికి వస్తే మౌనంగా ఉండాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. మనం అందరం కలిసి జీవిస్తే, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్నారు. మీ భద్రత, మీ జీవితం కోసం తాము సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించమని మమతా బెనర్జీ అన్నారు.