జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.

By Medi Samrat
Published on : 7 April 2025 3:10 PM IST

జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే.. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులకు అండ‌గా ఉంటామ‌న్న‌ సీఎం.. పాఠశాలలో ఉద్యోగాలు కోల్పోయిన అర్హులైన అభ్యర్థులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. మీరు నిరుద్యోగులుగా ఉండకూడదని.. మీ సేవల‌లో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం భరోసా ఇస్తుందని మమత హామీ ఇచ్చారు.

ఏప్రిల్ 3న బెంగాల్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాన్ని సుప్రీంకోర్టు చెల్లుబాటు కాకుండా చేసింది.. మొత్తం ఎంపిక ప్రక్రియ 'కళంకమైనది' అని పేర్కొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఎస్‌ఎస్‌సి అవినీతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయేతరులతో సమావేశమయ్యారు.

అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలుస్తాను. ఇతరులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను. మీ గౌరవాన్ని పునరుద్ధరించడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను. అర్హులైన అభ్యర్థులకు సేవలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా మేము విభిన్న ప్రణాళికలను కలిగి ఉన్నాము. వారిని నిరుద్యోగులుగా ఉండనివ్వము. స్కూల్ జాబ్స్ కోల్పోయిన వారితో పాటు నిలబడినందుకు నన్ను ఎవరైనా శిక్షించాలనుకుంటే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ, సీపీఐ(ఎం)పై మాట‌ల‌ దాడి చేసిన ఆమె.. మొత్తం విద్యావ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. కొంత మంది డర్టీ గేమ్ ఆడుతున్నారని విమ‌ర్శించారు.

Next Story