భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో ఓ సరికొత్త కూటమిని తీసుకుని రావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ మధ్య బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘అతిపెద్ద టీఆర్పీ’ అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షానికి నాయకుడిగా కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని, రాహుల్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ముఖచిత్రంగా ఉంటే ప్రధాని మోదీని ఎవరూ విమర్శించలేరని మమత అన్నారు. పార్లమెంట్ లో అదానీ, ఎల్‌ఐసీ ఇష్యూపై చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాము.. అదానీ సమస్యపై చర్చలు ఎందుకు జరగడం లేదు? ఎల్‌ఐసీపై చర్చలు ఎందుకు జరగడం లేదు? గ్యాస్ ధరపై చర్చ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు మమతా బెనర్జీ. వీటన్నింటి మధ్య ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టారని.. మేం ఉమ్మడి పౌరస్మృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని దీదీ చెప్పుకొచ్చారు.