తల తీసేయండి.. అయినా డీఏ మాత్రం పెంచేదిలేదు : మమతా బెనర్జీ
డీఏ పెంచాలంటూ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై సీఎం మమత బెనర్జీ స్పందించారు.
By తోట వంశీ కుమార్ Published on 7 March 2023 6:08 AM GMTమమతా బెనర్జీ
డీఏ(కరువు భత్యం) పెంచాలని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్నారు. కేంద్రంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచాలని ఉద్యోగులకు మద్దతుగా విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
ఉద్యోగులు కోరుకున్నంత డీఏ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ఇచ్చినట్లు తెలిపారు. "తరచూ డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే పెంచడం కుదరదు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పటికే అదనంగా మూడు శాతం డీఏ ప్రకటించాం. మీకు ఇంకా ఎంత కావాలి..? ఆ పెంపుతో సంతోషంగా లేకుంటే.. నా తల తీసేయండి." అని మమత అసహనం వ్యక్తం చేశారు.
విపక్షాలు కేంద్రంతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు డీఏ చెల్లించాలని డిమాండ్ చేస్తుండడం పై మండిపడ్డారు మమత. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పే స్కేల్ వేర్వేరు. జీతంతో కూడిన ఇన్ని సెలవును ఏ ప్రభుత్వం ఇస్తోందని ప్రశ్నిచారు. డీఏ కోసం రూ.1.79లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 40 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాం. అయినా మీరెందుకు కేంద్రంతో పోలుస్తున్నారు. మేం ఉచిత బియ్యం ఇస్తున్నాం. అయితే.. గ్యాస్ ధర చూడండి ఎంత ఉందో..? ఎన్నికల తరువాతి రోజు గ్యాస్ ధరలు పెరుగుతాయంటూ విపక్షాలకు విరుచుకుపడ్డారు.
ఫిబ్రవరి 15న అసెంబ్లీలో 2023-24 బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రవేశపెట్టారు. మార్చి నుంచి ఉపాధ్యాయులు, పెన్షనర్లతో సహా తమ ఉద్యోగులకు ప్రభుత్వం 3 శాతం అదనపు డీఏ చెల్లిస్తుందని ఆ సమయంలోనే ప్రకటించారు.