ఇన్ డైరెక్ట్‌గా రిజర్వేషన్లు ఎత్తివేసే ప్లాన్ చేస్తున్నారు : మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge Slams Modi Government. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే శుక్ర‌వారం హైద్రాబాద్‌లో ప‌ర్య‌టించారు

By Medi Samrat  Published on  3 Sept 2021 3:41 PM IST
ఇన్ డైరెక్ట్‌గా రిజర్వేషన్లు ఎత్తివేసే ప్లాన్ చేస్తున్నారు : మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే శుక్ర‌వారం హైద్రాబాద్‌లో ప‌ర్య‌టించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయ‌న‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంత‌రం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ ఎప్పుడూ చెబుతుంటాడు.. అచ్చే దిన్ రాబోతుందని.. రూ. 3.5 లక్షల కోట్ల సంపదను ఇప్పటికే అమ్మేయడమే మంచి రోజులా.. అని ప్ర‌శ్నించారు.

నెహ్రూ.. ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం కోసం పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చారని.. వ్యాపారం వృద్ధి చెందితేనే దేశ సంపద పెరుగుతుందని ఆలోచన చేశారని.. మిశ్రమ ఆర్థిక వృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్ సంస్థలను ప్రొత్సహించారని.. పబ్లిక్ సెక్టార్ లో 35 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్లను, బ్యాంకింగ్, రైల్వే, ఇన్సూరెన్స్ సంస్థలను అమ్మేస్తున్నారని.. పబ్లిక్ సెక్టార్లను పూర్తిగా అమ్మేస్తే.. రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని.. నరేంద్రమోదీ ఇన్ డైరెక్ట్ గా రిజర్వేషన్లు ఎత్తేసే ప్లాన్ చేస్తున్నారని విమ‌ర్శించారు.

1991లో పీవీ నరసింహారావు హయాంలో.. విదేశీ నిధులను ఆహ్వానించినా.. పబ్లిక్ సెక్టార్ ను డిస్టర్బ్‌ చేయలేదని.. ప్రజా పన్నుల ద్వారా కూడబెట్టిన ఆస్తులను మోదీ తెగనమ్మేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. జాతీయ రహదారులను అమ్ముతున్నారు.. ప్యాసింజర్ ట్రైన్లు.. ప్రభుత్వ ఆధీనంలో లేవు.. విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు.. 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలను అమ్మేస్తున్నారని.. భవిష్యత్తులో నాగార్జున సాగర్ డ్యాం ను సైతం లీజ్ కు ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా సంపదను కాపాడిందని.. బీజేపీ ఆ సంప‌ద‌ను తెగనమ్మేస్తోందని ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ లూటీ చేయడం.. దోస్తులకు పంచి పెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే నియంత్రణ కోల్పొయి.. పేదలు మరింత పేదలుగా మిగులుతారని విచారం వ్య‌క్తం చేశారు. రైల్వేశాఖలో 14 లక్షల మంది పని చేస్తున్నారని.. వీరి పరిస్థితి ఏంటి..? అని ప్ర‌శ్నించారు. పబ్లిక్ సెక్టార్ నిర్విర్యం అయితే.. రిజర్వేషన్లు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని.. వంద కోట్ల పెట్టుబడులు వస్తాయని.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చెప్పారని.. ఎక్కడ వస్తాయి.. ఉన్న వాటినే అమ్మేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Next Story