పులుల డేటా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరోసారి ఆ రాష్ట్రమే టాప్
Madhya Pradesh Retains Tiger State Status, Tiger Census State Report Issued. భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
By Medi Samrat
భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పులుల సంఖ్యకు సంబంధించి ఓ డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ కిరీటం చెక్కుచెదరకుండా ఉంది.
డేటా ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 785 పులులు ఉన్నాయి. ఇవి మునుపటి గణాంకాల కంటే 259 ఎక్కువ. మధ్యప్రదేశ్‌లో 2020 సంవత్సరం తర్వాత 259 పులులు పెరిగాయి. మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక (563), ఉత్తరాఖండ్ (560) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందన తెరపైకి వచ్చింది. మన రాష్ట్ర ప్రజల సహకారం, అటవీ శాఖ అలుపెరగని కృషి ఫలితంగా నాలుగేళ్లలో మన రాష్ట్రంలో 526 ఉన్న రాచ పులుల సంఖ్య 785కి పెరగడం సంతోషించదగ్గ విషయం. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించిన రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మనమందరం కలిసి భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం.
2006 నుంచి 2022 వరకు పులుల గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గణాంకాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 485 పులులు పెరిగాయి. 2006లో రాష్ట్రంలో 300 పులులు ఉండగా.. 2022 నాటికి ఈ సంఖ్య 785కి పెరిగింది. పులుల సంఖ్యలో కర్ణాటకకు రెండో స్థానం లభించింది. ఇక్కడ 563 పులులు ఉన్నాయి. పులుల సంఖ్యను పెంచడంలో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. 2006తో పోలిస్తే 273 పులులు పెరిగాయి.
పులుల సంఖ్య పరంగా ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో ఉంది. అయితే పులుల సంఖ్యను పెంచడంలో ఉత్తరాఖండ్ రెండవ స్థానంలో ఉంది. 2006 నుంచి ఇక్కడ 384 పులులు పెరిగాయి. పులుల పెరుగుదలలో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 444 పులులు ఉండగా.. 2006లో 103 పులులు ఉన్నాయి. మహారాష్ట్రలో 341 పులులు పెరిగాయి. 306 పులులతో తమిళనాడు ఐదవ స్థానంలో ఉంది. 2006లో రాష్ట్రంలో 76 పులులు మాత్రమే ఉండేవి. గత 16 ఏళ్లలో ఇక్కడ 230 పులులు పెరిగాయి. అటవీ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోని అడవి పులుల జనాభాలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయి.