12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

By Knakam Karthik
Published on : 3 April 2025 1:41 AM

National News, Parliament, Loksabha, Waqf Amendment Bill, Bjp, Congress

12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు.

అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ దద్దరిల్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే మొదటిసారి.

కాగా ఈ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే) లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్) మద్దతిచ్చారు. మరో వైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిల్లు పేపర్లను చించివేశారు. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.

అయితే.. వక్ఫ్ భూముల పరిరక్షణ, పరిపాలనను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అక్రమ ఆక్రమణలు, అవినీతిని నివారించేందుకు కొత్త నిబంధనలు, వక్ఫ్ బోర్డు అధికారాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వివాదాస్పద భూముల పరిష్కరానికి సమర్థవంతమైన విధానాలు ఈ బిల్లు సూచిస్తుందని తెలిపింది.

Next Story