పరిష్కారమైన కేసును మళ్లీ కోర్టులో సవాల్ చేసినందుకు సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని మందలించింది. ఒకే విషయాన్ని పదేపదే కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థ సమయాన్ని వృధా చేయడమేనని కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో పాటు సదరు వ్యక్తికి జరిమానా కూడా విధించారు. ఒక సమస్యను అత్యున్నత స్థాయిలో పరిష్కరించిన తర్వాత మళ్లీ మళ్లీ లేవనెత్తే అవకాశం న్యాయ వ్యవస్థలో ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనివల్ల న్యాయవ్యవస్థ సమయం వృథా అవుతుందని పేర్కొంది.
ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కేసును విచారించిన కోర్టు 2004లో ముగించింది. అయితే తనకు అన్యాయం జరిగిందని భావించిన వ్యక్తి.. మరలా కోర్టు తలుపు తట్టాడు. దీనిపై జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 32వ అధికరణం వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లు భావించినప్పుడు.. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పించింది.
మే 1న జారీ చేసిన ఉత్తర్వులో బెంచ్.. ఏ న్యాయ వ్యవస్థలోనూ ఒక వ్యక్తి ఒకే సమస్యను అత్యున్నత స్థాయిలో పదే పదే పరిష్కరించే అవకాశం ఉండదని పేర్కొంది. ఇది న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృధా చేయడమే. సమయం వృధా చేసినందుకు జరిమానాతో పాటు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఆ నిరుద్యోగిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేవలం రూ.10,000 జరిమానా మాత్రమే విధించింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీకి వినియోగించే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వెల్ఫేర్ ఫండ్‌లో రూ.10,000 డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.