ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం, నిరసన తెలిపిన రైతులను హత్య చేయడానికి ప్రణాళికాబద్ధమైన కుట్ర జరిగిందని పేర్కొంది. వారి దర్యాపులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో సహా నిందితులపై అభియోగాలను సవరించాలని అధికారులు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు, నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 304A (అపరాధపూరితమైన నరహత్య), సెక్షన్ 279 (నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం), సెక్షన్ 338 (తీవ్రమైన గాయం కలిగించడం) తొలగించాలని పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు.
ఆశిష్ మిశ్రాపై, సెక్షన్ 307 (హత్యకు ప్రయత్నించడం), సెక్షన్ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపరచడం), సెక్షన్ 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు), సెక్షన్ 3/25 ఆయుధాలు వర్తించేందుకు సిట్ అనుమతి కోరింది. లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస ప్రమాదవశాత్తు లేదా నేరపూరిత హత్య కాదని, ఆయుధాలు కలిగి ఉండగా హత్యాయత్నానికి పథకం ప్రకారం జరిగిన కుట్ర అని విచారణాధికారి విద్యారామ్ దివాకర్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు.
అక్టోబరు 3న ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బృందం ప్రదర్శన నిర్వహిస్తుండగా లఖింపూర్ ఖేరీలో ఒక ఎస్‌యూవీ వాహనంతో దూసుకురావడంతో నలుగురు రైతులు మరణించారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్ట్ తరువాతి హింసలో మరణించారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాతోపాటు ఇతర నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.