రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు.. ఆ పార్టీల ఐక్యత నమ్మదగునా..?
KCR backs Yashwant Sinha as presidential nominee in opposition unity gesture. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మద్దతు
By Medi Samrat
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మద్దతు ఇస్తున్నట్లు ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కెటి రామారావు ట్వీట్‌లో తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. విపక్షాలు ఆయన్ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. "భారత రాష్ట్రపతి ఎన్నికలలో యశ్వంత్ సిన్హా జీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. మా పార్లమెంట్ సభ్యులతో పాటు, ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు TRS తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తాను" అని KTR తెలిపారు.
కేసీఆర్ 2024 ఎన్నికలకు ముందు విపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. జాతీయ ఎన్నికలకు ముందు విపక్షాలు ఐక్యంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. శరద్ పవార్, మమతా బెనర్జీ సహా విపక్ష నేతల మధ్య వరుస చర్చల తర్వాత విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు వెల్లడైంది. గత వారం, NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పార్లమెంటుకు నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు మద్దతు తెలిపేందుకు హాజరయ్యారు.
ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ప్రతినిధిగా ఆయన హాజరు అవుతారు. ఆదివారం రాత్రే కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలూ ఢిల్లీ చేరుకున్నారు. సిన్హా నామినేషన్ పేపర్లపై టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంట్ కార్యదర్శి చాంబర్‌లో సిన్హా నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మొదట్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కాంగ్రెస్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. కాంగ్రెస్ ఉండటంతో విపక్షాలకు మద్దతివ్వకూడదని మొదట్లో టీఆర్ఎస్ భావించింది. కానీ, సీఎం కేసీఆర్‌కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేసి సిన్హాకు మద్దతివ్వాలని కోరారు.