న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు.
By - Knakam Karthik |
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఈసీఐఆర్‌ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని, హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ నేతలతో కలిసి ఖర్గే మాట్లాడారు. ఈ కేసులో న్యాయం గెలిచిందని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేయరాదన్న పాఠం మోదీ–షాలకు నేర్పిందని ఆయన అన్నారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతిపాలుచేయడానికే ఈ కేసు నమోదు చేశారని ఖర్గే ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం)ను ఆయుధంగా మార్చుకుని రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందని ఖర్గే విమర్శించారు. ఈడీ భయపెట్టడం ద్వారా ఎంపీలను బీజేపీలోకి లాగడం, రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు జరగడం దేశం చూసిందని ఆయన అన్నారు. రాజకీయంగా ఈ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ, “వీధి నుంచి పార్లమెంట్ వరకూ ప్రతి వేదికపై ప్రభుత్వాన్ని బట్టబయలు చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కోర్టు తీర్పు వివరాలను కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వివరించారు. “శబ్దం కంటే చట్టమే బలంగా మాట్లాడింది” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, ఈ కేసు మాటల్లో పెద్దది కానీ ఆధారాల్లో శూన్యమని అన్నారు. “అతి శబ్దం, ఆర్భాటం తప్ప అంతర్గతంగా ఏమీలేని వ్యవహారమిది” అని వ్యాఖ్యానించారు.
2014 నుంచి 2021 వరకు సీబీఐ, ఈడీ ఫైళ్లలోనే ప్రైవేట్ ఫిర్యాదుదారు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదులో పూర్వాపర నేరం (ప్రెడికేట్ ఆఫెన్స్) లేదని స్పష్టమైన నోట్లు ఉన్నాయని సింఘ్వీ వెల్లడించారు. అయినప్పటికీ, 2021 జూన్‌లో పైస్థాయి ఆదేశాలతో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిందని, కోర్టు ఇప్పుడు ఆ దశలోనే కేసును స్వీకరించడానికి నిరాకరించిందని చెప్పారు. ఈసీఐఆర్ ఎవరి ఆదేశాలతో నమోదైందో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు