తొలి మహిళా సీజేఐగా చరిత్ర సృష్టించనున్న జస్టిస్ బీవీ నాగరత్న
Justice BV Nagarathna. మహిళా జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు
By Medi Samrat Published on 26 Aug 2021 7:04 PM ISTసుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడానికి కొలీజియం తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి ప్రాతిపాదించింది. రాష్ట్రపతి ఇందుకు సమ్మతం తెలిపితే త్వరలోనే తొమ్మిది మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికవుతుంటారు. ఇదే రూల్ ప్రకారం, జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకునే అవకాశముంది. తద్వారా తొలి మహిళా సీజేగా చరిత్ర సృష్టించనున్నారు.
కర్నాటక హైకోర్టులో 2008లో జస్టిస్ నాగరత్న అదనపు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు పర్మినెంట్ జడ్జిగా మారారు. జస్టిస్ బీవీ నాగరత్న ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజే ఈఎస్ వెంకటరామయ్య కూతురు. 1989 జూన్ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీజేఐగా కొనసాగారు. ఆమె కూతురు జస్టిస్ బీవీ నాగరత్న కూడా సీజేఐగా బాధ్యతలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. 1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిన్ నాగరత్న 1987 అక్టోబర్ 28న అడ్వకేట్‌గా బెంగళూరులో ఎన్‌రోల్ అయి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాన్‌స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, ఇన్సూరెన్స్ లా, సర్వీస్ లా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ పబ్లిక్ లా సహా చాలా రంగాల్లో ఆమె ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించుకున్నారు. 2008 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ బీవీ నాగరత్న అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2010 ఫిబ్రవరి 17న శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆమెను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడానికి సీజే ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే 2027లో జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందినవారిలో మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహా ఉన్నారు. కొలీజియం ప్రతిపాదించిన జాబితాలో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లు ఉన్నారు.