జయలలిత నివాసం 'పొయెస్ గార్డెన్' వారికే దక్కింది..!
Jayalalithaa's Niece Takes Over Chennai Residence After Legal Battle. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత అన్న కుమార్తె దీప కోర్టులో
By Medi Samrat Published on 11 Dec 2021 3:51 PM ISTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత అన్న కుమార్తె దీప కోర్టులో విజయం అందుకుంది. జయలలితకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె నివాసమైన పొయెస్ గార్డెన్‌లోని వేద నిలయం తనకే దక్కాలంటూ కోర్టును ఆశ్రయించిన దీప విజయం సాధించారు. వేద నిలయాన్ని దీపకు అందించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ తీర్పుతో చెన్నై కలెక్టర్ విజయరాణి దీప చేతికి వేద నిలయం తాళాలు అందించారు. జయలలిత మరణం తర్వాత ఆమె నివాసం ప్రభుత్వం పరమైంది. వేద నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడాన్ని సవాలు చేస్తూ జయలలిత అన్న కుమారుడు, కుమార్తె అయిన దీపక్, దీపలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వి చారించిన న్యాయస్థానం మెరీనా బీచ్‌లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని, ఇప్పుడు రెండోది ఎందుకని ప్రశ్నించింది.
వేద నిలయాన్ని స్వాధీనం చేసుకోవడం కుదరదని.. దానిని ఆమె వారసురాలైన దీపకు అందించాలని ఆదేశించింది. పోయస్ గార్డెన్‌లోని జయ నివాసం వేద నిలయాన్ని స్మారక చిహ్నంగా మార్చాలని ఏఐఏడీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించిన తీరును కోర్టు తప్పుపట్టింది. ఆ ఇంటిని స్మారక చిహ్నంగా మార్చే హక్కు పార్టీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించింది. '' ఇది సాధారణ విజయం కాదు. జయలలిత మరణం తర్వాత ఆ ఇంటిలోకి తొలిసారి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ ఇంటిలోనే పుట్టాను. అత్త జయలలితతో ఈ ఇంటిలో గడిపిన ఎన్నో జ్ఞాపకాలతో నా మనసు నిండిపోయింది" అని దీప భావోద్వేగానికి గురయ్యారు. భర్త మాధవన్, శ్రేయోభిలాషులతో కలిసి వేదనిలయంలో అడుగుపెట్టారు. అనంతరం జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.