జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం నాడు దక్షిణ కశ్మీర్ జిల్లాలైన పుల్వామా, షోపియాన్‌లలో మల్టీప్లెక్స్ సినిమా హాల్‌స్ ను ప్రారంభించారు.జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో త్వరలో ఇలాంటి మల్టీపర్పస్ సినిమా హాళ్లను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సినిమా హాళ్లను పుల్వామా, షోపియాన్ యువతకు అంకితం చేస్తున్నానని పుల్వామాలో విలేకరులతో మనోజ్ సిన్హా అన్నారు. అంతేకాకుండా ఈ సందర్భం చారిత్రకమైనదని అభివర్ణించారు. "A historic day for J&K UT! Inaugurated Multipurpose Cinema Halls at Pulwama and Shopian. It offers facilities ranging from movie screening, infotainment and skilling of youth," అని మనోజ్ సిన్హా ట్విట్టర్ చెప్పారు.
శ్రీనగర్‌లోని సోమవార్ ప్రాంతంలో కశ్మీర్‌లోని మొదటి INOX మల్టీప్లెక్స్ వచ్చే వారం ప్రజల కోసం తెరవబడుతుంది. ఇందులో మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లు ఉంటాయి. 1980ల చివరి వరకు దాదాపు డజను సినిమా హాళ్లు కశ్మీర్ లోయలో పని చేసేవి.. అయితే రెండు తీవ్రవాద సంస్థలు యజమానులను బెదిరించడంతో వారు వారి వ్యాపారాలను ముగించాల్సి వచ్చింది. 1990ల చివరలో అధికారులు కొన్ని థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రయత్నించినప్పటికీ, సెప్టెంబర్ 1999లో లాల్ చౌక్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమాపై గ్రెనేడ్ దాడి చేయడం ద్వారా తీవ్రవాదులు థియేటర్ ఓనర్లకు గట్టి హెచ్చరికలు పంపించారు. మరో రెండు థియేటర్లు నీలం, బ్రాడ్‌వే లను ఓపెన్ చేసినప్పటికీ.. ప్రజల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో మూసి వేయాల్సి వచ్చింది.