భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) మరో విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సీఎంఎస్-01 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియలు కొనసాగుతున్నాయి.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసింది ఇస్రో. అండమాన్, నికోబర్, లక్షద్వీప్‌లలో.. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించనుంది.
దేశంలో ఇకపై మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఏడేళ్ల పాటు కక్షలో తిరుగుతూ ఉంటుంది. PSLV సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వ ప్రయోగం కాగా.. షార్ నుంచి చేపడుతున్న 77వ మిషన్ ఇది. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యునికేషన్ ఉపగ్రహం కావడం గమనార్హం. పదకొండు ఏళ్ల క్రిందట పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీ శాట్-12 జీవిత కాలయం ముగియడంతో.. దాని స్థానంలో సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని పంపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.