పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. హింసను తక్షణం ఆపండి
Indian PM Modi urges Putin to end violence.రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న పరిస్థితులు అన్ని దేశాలను కలవరపాటుకు
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 8:38 AM ISTరష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న పరిస్థితులు అన్ని దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గురువారం రాత్రి ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే హింసను నిలిపివేయాలని, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. ఈ క్రమంలో ఇటీవల ఉక్రెయిన్‌లో తలెత్తిన పరిణామాల గురించి ప్రధానికి పుతిన్ వివరించారు.
నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు.. ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి పుతిన్‌తో చర్చించారు. అక్కడ ఉంటున్న విద్యార్దులపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న విషయాన్ని ఫోన్‌లో వివరించారు. వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడమే తమకు అత్యంత ప్రధానమని మోదీ తెలిపారు.
విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చేందుకు..
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించిన నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కమిటీ కీలక భేటీ జరిగింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, జై శంకర్, పీయూష్ గోయల్, హర్ధీప్‌సింగ్ పురి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తదితరులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా మీడియాకు తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతకూ, వారిని సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండగా.. వారిలో దాదాపు 4 వేల మంది ఇప్పటికే అక్కడ నుంచి బయటపడినట్లు వెల్లడించారు. మిగిలిన వారి భద్రతకు, వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ప్రధాని మోదీ చెప్పినట్లు ఆయన తెలిపారు.
తటస్థ వైఖరి
ఉక్రెయిన్-రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పింది.