ఆ ఆరుగురు దేశాన్ని 'చక్రవ్యూహం'లో బంధిస్తున్నారు : రాహుల్

ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు ఎలా ఇరుక్కుపోయాడో.. 21వ శతాబ్దంలో హిందుస్థాన్ మొత్తం చక్రవ్యూహంలో చిక్కుకుందని రాహుల్ అన్నారు

By Medi Samrat  Published on  29 July 2024 4:18 PM IST
ఆ ఆరుగురు దేశాన్ని చక్రవ్యూహంలో బంధిస్తున్నారు : రాహుల్

ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు ఎలా ఇరుక్కుపోయాడో.. 21వ శతాబ్దంలో హిందుస్థాన్ మొత్తం చక్రవ్యూహంలో చిక్కుకుందని రాహుల్ అన్నారు. బడ్జెట్‌లోని పలు లోటుపాట్లను రాహుల్ ఎత్తిచూపారు. రాహుల్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

అభిమన్యుడిని ఆరు మంది ట్రాప్ చేసి చంపారని.. అదే విధంగా ఇప్పుడు కూడా ఆరుగురు దేశాన్ని చక్రవ్యూహంలో బంధిస్తున్నారని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, ముఖేష్ అంబానీ, అదానీల నియంత్రణలో ఉన్నామ‌ని రాహుల్ అన్నారు. దేశాన్ని నడపడానికి ఈ ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారని అన్నారు.

చక్రవ్యూహానికి మరో పేరు పద్మం.. దీని అర్థం కమలం. 21వ శతాబ్దంలో కొత్త చక్రవ్యూహం కూడా కమలం ఆకారంలో ఉంటుంది. ప్రధాని మోదీ ఛాతీపై దాని చిహ్నాన్ని పెట్టుకుని తిరుగుతారన్నారు.

మోదీ ప్రభుత్వం కరోనా కాలంలో చిన్న వ్యాపారాలను నాశనం చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. దీని వల్ల దేశ వెన్నెముక విరిగిపోయింది. బడ్జెట్‌లో యువతకు చేసిందేమీ లేదన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం ఇద్దరి చేతుల్లోనే ఉందని రాహుల్ అన్నారు. అదానీ, అంబానీల పేరు చెప్పి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అడ్డుకోవడంతో.. రాహుల్ గాంధీ నేను ఆ పేర్లను తీసుకోను.. కానీ A1, A2 అని పిలుస్తాను అని అన్నారు.

ఈ ప్రభుత్వం రైతులను కూడా చక్రవ్యూహంలో ఇరికించింద‌ని రాహుల్ అన్నారు. నన్ను కలవడానికి రైతుల ప్రతినిధి బృందం వచ్చిందని.. అయితే నన్ను కలవడానికి అనుమతించడం లేదని ఆయన అన్నారు. దేశంలోని రైతులు ఎంఎస్‌పికి చట్టబద్ధమైన హామీని మాత్రమే డిమాండ్ చేస్తున్నారని.. అయితే బడ్జెట్‌లో ఏమీ చేయలేదని రాహుల్ అన్నారు. దీంతో పాటు పేపర్ లీక్ అంశాన్ని కూడా రాహుల్ లేవనెత్తారు. బడ్జెట్‌లో నీట్‌ పేపర్‌ లీక్‌పై ఆర్థిక మంత్రి ఏదో చెబుతారని యువత ఊహించిందని.. అయితే ఆమె ఏమీ మాట్లాడలేదన్నారు.

Next Story