రానున్న పదేళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో కొత్త డాక్టర్లు రాబోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రారంభ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "భుజ్‌లోని ఈ ఆసుపత్రి ప్రజలకు సరసమైన ధరలో మంచి నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. రెండు దశాబ్దాల క్రితం.. గుజరాత్‌లో కేవలం 1,100 సీట్లతో కేవలం తొమ్మిది మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. నేడు మనకు 6,000 సీట్లతో 36 కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు.
మెరుగైన ఆరోగ్య సౌకర్యాల కోసం రానున్న పదేళ్లలో భారత్‌లో రికార్డు స్థాయిలో వైద్యుల సంఖ్య పెరుగుతుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. "దేశంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నా లేదా అందరికీ వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసినా.. రాబోయే 10 సంవత్సరాలలో మాత్రం దేశం రికార్డు స్థాయిలో కొత్త వైద్యులను పొందబోతోంది" అని ప్రధాని మోదీ అన్నారు. "మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కేవలం వ్యాధుల చికిత్సకు మాత్రమే పరిమితం కావు.. అవి సామాజిక న్యాయాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. పేదలకు చౌకైన, ఉత్తమమైన చికిత్స అందుబాటులోకి వచ్చినప్పుడు.. వ్యవస్థపై ప్రజల విశ్వాసం బలపడుతుంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.