విదేశాల్లో కూడా ఇక యూపీఐ పేమెంట్లు
India, Singapore to link their fast payment systems UPI and PayNow. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 15 Sept 2021 5:17 PM ISTరిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం కోసం ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తొలుత జీ 20 దేశాలతో యూపీఐ పేమెంట్లు ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ , సింగపూర్ దేశాల మధ్య ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్ దేశాల మధ్య యూపీఐ చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది. భారతదేశం, సింగపూర్ దేశాల మధ్య కార్డులు, క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం జరిగింది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (NIPL), నెట్‌వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్ (NETS) భాగస్వామ్యంతో ఈ అనుసంధానం జరిగిందని ఆర్బీఐ తెలిపింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(Unified Payments Interface) సౌకర్యం 2016లో అందుబాటులో వచ్చింది. ప్రారంభంలో నెమ్మదిగా ఉన్నా ఇప్పుడు రోజూ భారీగా పేమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది కస్టమర్ సృష్టించిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ని ఉపయోగించి తక్షణమే పేమెంట్‌లు చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకోవాల్సిన అవసరం లేకుండానే సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది యూపీఐ పర్సన్ టు పర్సన్ (P2P), పర్సన్ టు మర్చంట్ (P2M) చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. అలాగే యూజర్లు ఇతరులకు డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది.
సింగపూర్లో అమల్లో ఉన్న పే నౌ సిస్టమ్ కూడా భారత్ సిస్టమ్ లాగానే పనిచేస్తుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సర్వీస్. యూజర్ తన బ్యాంక్ నంబర్‌కు బదులుగా తన మొబైల్ నంబర్ లేదా NRIC/FIN లేదా UEN నంబర్‌ని ఉపయోగించి ఇతరుకు మనీ సెండ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. పే నౌ మొత్తం తొమ్మిది బ్యాంకులు, మూడు నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ (NFI) కి మద్దతు ఇస్తుంది.