ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ఉపయోగించింది భారత్. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ కు సంబంధించిన అదనపు యూనిట్ల కోసం భారతదేశం అధికారికంగా రష్యాను సంప్రదించిందని ఉన్నత స్థాయి రక్షణ వర్గాలు తెలిపినట్లుగా ఇండియా టుడే నివేదించింది.
భారత సైన్యంతో ఇప్పటికే పనిచేస్తున్న రష్యాలో తయారు చేసిన S-400 వ్యవస్థలు ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను అడ్డగించడంలో మరియు తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషించాయి. పశ్చిమ సరిహద్దు నుండి వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థలు అధిక ఖచ్చితత్వం, ప్రభావాన్ని ప్రదర్శించాయి. ఈ పనితీరుతో భారతదేశం, మాస్కో నుండి మరిన్ని డెలివరీలను కోరుతూ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి ముందుకు వచ్చింది. సమీప భవిష్యత్తులో రష్యా ఈ అభ్యర్థనను ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది.